₹11.40 లక్షల బీమా చెక్కు అందజేసిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన ఏలూరు జిల్లా హోంగార్డు (HG 574) ఎం. వీరబాబు కుటుంబానికి జిల్లా పోలీసు యంత్రాంగం అండగా నిలిచింది. బుధవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు ప్రభుత్వ జనరల్ ఇన్సూరెన్స్ (PGI) కింద మంజూరైన రూ.11,40,000 (పదకొండు లక్షల నలభై వేల రూపాయలు) బీమా చెక్కును మృతుడి భార్య రామలక్ష్మీ దేవికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వీరబాబు విధుల పట్ల అంకితభావం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పనిచేశారని కొనియాడారు. ఈ ఏడాది జనవరి 19న ఆయన మృతి చెందడం హోంగార్డు విభాగానికి తీరని లోటుగా పేర్కొన్నారు.
వీరబాబు అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ మరియు హోంగార్డు వ్యవస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. బీమా సొమ్ము కుటుంబానికి కొంత మేర ఆర్థిక భరోసా కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే, బాధిత కుటుంబానికి బీమా సొమ్ము త్వరితగతిన అందేలా కృషి చేసిన అధికారులను ఎస్పీ అభినందించారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ప్రధాన కార్యాలయ బి-సెక్షన్ సూపరింటెండెంట్ పి. నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, హోంగార్డు విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.


