తాజా వార్తలు

10/recent/ticker-posts

విద్యతో పాటు నైతిక విలువలు అవసరం – పోలిశెట్టి మల్లిబాబు


మండపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను కూడా అలవర్చుకోవాలని పోలిశెట్టి మల్లిబాబు సూచించారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో “యువత – భవిత” అంశంపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. టి.కె.వి. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ… యువత నిబద్ధతతో చదువుకొని, నైతిక విలువలను అలవర్చుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. వ్యాపార ప్రారంభ దశలో తాను కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, పట్టుదలతో ముందుకు సాగి ఇతర రాష్ట్రాల్లో కూడా సంస్థను విస్తరించి సుమారు 800 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు.

సోషల్ మీడియా ప్రభావానికి లోనై భవిష్యత్తును దెబ్బతీయకుండా పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న డా. నూజిళ్ళ శ్రీనివాసరావు సురుచి ఫుడ్స్ సంస్థ ప్రస్థానాన్ని వివరించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఆయన రచించిన “తాజా… తాజా… కాజా” పాట విద్యార్థులను ఆకట్టుకుంది.

స్కిల్ హబ్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మల్లిబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాల సిబ్బంది ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆనంద్, పీఆర్‌ఓ వర్మ, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.