విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటువంటి కొరత లేకుండా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇంధనం సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అపోహలకు గురై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.
ఇంధన సరఫరా పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడు ప్రాంతాల్లోని హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ బంకులను సందర్శించి నిల్వలు, సరఫరా పరిస్థితిని పరిశీలించారు.
ఇటీవల వదంతుల కారణంగా ప్రజలు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని కలెక్టర్ తెలిపారు. అయితే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందన్నారు. జిల్లాలో ప్రతి రోజు సుమారు 8 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా జరుగుతోందని వెల్లడించారు.
ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బంకుల్లో ఆయిల్ అయిపోయిన రెండు గంటల్లోపే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేలా పర్యవేక్షణ కొనసాగుతున్నదని చెప్పారు. ఈ చర్యల వల్ల బంకుల వద్ద క్యూ లైన్లు లేకుండా వినియోగదారులు తక్షణమే ఇంధనం పొందగలుగుతున్నారని పేర్కొన్నారు.
ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అవసరానికి తగినంత మాత్రమే ఇంధనం వినియోగించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454ను సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఇంధన సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ పర్యవేక్షణలో విజయవాడ రూరల్ తహశీల్దార్ బి. సుగుణ, రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


