తాజా వార్తలు

10/recent/ticker-posts

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 43వ రోజుకు చేరిన యూత్ టైం బ్యాంక్ సేవలు


ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 28: కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యూత్ టైం బ్యాంక్ సేవలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 43వ రోజు కూడా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని యువజన సేవల శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి మరియు ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ వెల్లడించారు.


ఆసుపత్రిలో సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని మార్చి 16న ఈ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక కాలేజ్ నుంచి 30–40 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పాల్గొంటూ సేవలు అందిస్తున్నారు. ఈ వాలంటీర్లు ఆసుపత్రికి వచ్చే వయోవృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు, నిరక్షరాస్యులకు ఓపి తీసుకోవడం నుంచి డాక్టర్‌ను సంప్రదించడం, టెస్టులు చేయించడం, మందులు తీసుకోవడం, ఆటోలో పంపించే వరకు పూర్తి సహాయం అందిస్తున్నారు.

వాలంటీర్లు రోగులతో గడిపిన సమయాన్ని ‘టైం బ్యాంక్’లో నమోదు చేస్తారు. ఈ సేవలో పాల్గొన్న వారికి జిల్లా కలెక్టర్ ద్వారా మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఈ రోజు ఎస్.ఆర్.కె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన 60 మంది ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేవలందించారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఎన్జీవోలు కూడా భాగస్వామ్యం కావాలని అధికారులు కోరుతున్నారు. డిగ్రీ విద్యార్థులు తమ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌ల కోసం యూత్ టైం బ్యాంక్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. సేవల అనంతరం వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొన్నారు.

ఈ సేవల ద్వారా పేషంట్లకు, విద్యాసంస్థలకు, జిల్లాకు మంచి పేరు వస్తుందని అధికారులు పేర్కొన్నారు. యూత్ టైం బ్యాంక్‌లో పాల్గొనదలచిన వారు 9849909069 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.