హైదరాబాద్, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: నగరంలో డ్రగ్ కార్యకలాపాలు మళ్లీ ఉధృతమవుతున్నాయి. పబ్‌లు, ఫామ్‌హౌస్‌లను కేంద్రంగా చేసుకుని డ్రగ్ పార్టీలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వరుసగా దాడులు చేపడుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ పరిధిలో నైజీరియన్ మహిళ డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం, సికింద్రాబాద్ లోని పారడైజ్ సమీపంలో సన్‌షైన్ హాస్పిటల్ వద్ద డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్ మహిళను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు 7.5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాము రూ.15 వేలకి కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో రూ.30 వేలకి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆటోలో వచ్చి సరఫరా చేస్తుండగా ఆమెను పట్టుకుని ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.
ఇదిలాఉంటే, కొండాపూర్ లో మిడ్‌నైట్ డ్రగ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. క్వేక్ ఏరినా పబ్‌లో ప్రత్యేక ఈవెంట్ పేరిట డ్రగ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో ఈగల్ టీమ్ దాడులు చేపట్టింది. మొత్తం 64 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా తొలుత 8 మందికి పాజిటివ్‌గా తేలింది. అయితే తరువాత పరీక్షల్లో ఏడుగురినే డ్రగ్ వినియోగదారులుగా పోలీసులు నిర్ధారించారు.
రిత్విక్ అనే వ్యక్తికి యూరిన్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినప్పటికీ, బ్లడ్ టెస్ట్‌లో నెగిటివ్ రావడంతో నిద్ర మాత్రల ప్రభావమే కారణమని వైద్యులు పేర్కొన్నారు. డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిన వారిలో ఎవరికి కూడా పూర్వ చరిత్ర లేదని పోలీసులు తెలిపారు.
ఈ పార్టీకి హాజరైన నటి హేమ తనకు డ్రగ్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చిందని వీడియో విడుదల చేశారు.
డ్రగ్ మాఫియాపై ఈగల్ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నగరంలో డ్రగ్ కేసులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.


