తాజా వార్తలు

10/recent/ticker-posts

ఎన్టీఆర్ జిల్లాలో వింత వ్యాధి కలకలం.. నందిగామలో బాధితులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు


ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: జిల్లాలో అనూహ్యంగా వ్యాప్తి చెందుతున్న వింత అనారోగ్య సమస్య ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. చందాపురం గ్రామంలో ప్రారంభమైన ఈ సమస్య ప్రస్తుతం నందిగామ పట్టణానికి విస్తరించింది.


బాధితులు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో కుప్పకూలిపోతుండగా, ఇప్పటివరకు సుమారు 60 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొదట కొద్ది మందితో ప్రారంభమైన ఈ సమస్య క్రమంగా ఎక్కువమందికి వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. చందాపురం గ్రామంలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేసి, నందిగామ పట్టణంలో హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేశారు. ప్రజలు బయట ఆహారం తీసుకోవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

అస్వస్థతకు గల కారణాలను గుర్తించేందుకు ఆహార పదార్థాలు, తాగునీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామం, పట్టణాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

వైద్యులు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, శుద్ధి చేసిన తాగునీరు మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, బయట ఆహారం పూర్తిగా నివారించడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. స్వల్ప లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.

శాంపిల్స్ రిపోర్ట్ వచ్చిన తరువాతే అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.