తాజా వార్తలు

10/recent/ticker-posts

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి.. పార్లమెంట్‌లో చట్ట సవరణకు డిమాండ్


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 04: దళిత క్రైస్తవులను ఎస్సీ (SC)లుగా గుర్తిస్తూ పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో ఏలూరు స్ఫూర్తి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశం జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగింది.


ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా సామాజిక అసమానతలు కొనసాగుతుండటం ఆందోళనకరమన్నారు. 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం మతం మారినా దళితులపై వివక్ష కొనసాగుతుందని గుర్తించారని, అందువల్ల 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సూచించారని తెలిపారు.

అలాగే 2022లో జస్టిస్ బాలకృష్ణన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ నివేదిక ఇంకా బయటకు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ, వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ, మతం మారితే కులం పోదని, రిజర్వేషన్లు రద్దు చేయడం అన్యాయమని అన్నారు. విశ్రాంత న్యాయమూర్తి అడబాల లక్ష్మీ మాట్లాడుతూ అంటరానితనం ఇంకా కొనసాగుతుండటంతో సామాజిక దృక్పథంలో మార్పు అవసరమన్నారు.

సిపిఎం నాయకుడు పంపన రవికుమార్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు, అరసం నాయకుడు పి.పి. శాస్త్రి తదితరులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం అన్ని వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌తో పాటు పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని రెండు తీర్మానాలను సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ ప్రతిపాదించగా, సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్, ప్రజానాట్యమండలి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.