తాజా వార్తలు

10/recent/ticker-posts

నీటి నాణ్యతపై రాజీ లేదు – ఆర్‌వో ప్లాంట్లపై కలెక్టర్ లక్ష్మీశ కఠిన హెచ్చరిక


ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 08: వేసవి నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండదని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ఆర్‌వో ప్లాంట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు ఆదేశించారు.


బుధవారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాలంపాడు, సత్యనారాయణపురం ప్రాంతాల్లోని ఆర్‌వో ప్లాంట్లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంట్లకు నీరు ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, అనుమతుల స్థితి, ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలు, పరిశుభ్రత ప్రమాణాలు, నాణ్యత పరీక్షల విధానం వంటి అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి తాగునీటి సరఫరా వ్యవస్థ నిర్దేశిత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. అన్ని ఆర్‌వో ప్లాంట్లలో తనిఖీల షెడ్యూల్‌ను స్పష్టంగా ప్రదర్శించాలని, నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

అనుమతులు లేకుండా నడుస్తున్న లేదా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్లాంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేసవిలో తాగునీటి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

ప్రజలు కూడా తాగునీటి నాణ్యతపై ఎలాంటి సమస్యలు గమనించినా వెంటనే స్థానిక అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలలో నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జ్ సీఈ పి. సత్యకుమారి, సీఎంహెచ్‌వో కె. అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.