తాజా వార్తలు

10/recent/ticker-posts

విద్యుత్ బిల్లులు పెంచకుండా నిరంతర సరఫరా – మంత్రి గొట్టిపాటి రవికుమార్


విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.


గుణదలలోని విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) నూతన కార్యాలయాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, సీఎండీ పి. పుల్లా రెడ్డి సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు రూ.35-40 కోట్ల వ్యయంతో, 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలతో ఈ కార్యాలయాన్ని నిర్మించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, అంతరాయం లేని సరఫరాపై దృష్టి పెట్టామని చెప్పారు.

విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం వినియోగదారులలో ఉన్న సానుకూల దృక్పథాన్ని 80% నుండి 95%కు పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.

రైతులకు పగటిపూట విద్యుత్ సరఫరా కోసం పీఎం కుసుమ్ పథకం కింద చేపట్టిన టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నామని, బ్యాటరీ స్టోరేజ్ కోసం 10 చోట్ల టెండర్లు పిలిచామని వెల్లడించారు.

విపత్తుల సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది చేసిన సేవలను మంత్రి ప్రశంసించారు. గతంలో విశాఖపట్నంలో తుపాను సమయంలో వేలాది సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారని గుర్తుచేశారు.

ఎనర్జీ సెక్రటరీ కె. విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు, అమ్మకాలలో పారదర్శకత కోసం అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది గరిష్టంగా 14,009 మెగావాట్ల లోడ్‌ను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.

సీఎండీ పి. పుల్లా రెడ్డి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, సీఎజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.