విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి సుమారు రూ.160 నుంచి రూ.170 కోట్లతో భారీ ప్రణాళిక చేపట్టినట్లు రాష్ట్ర రవాణా, క్రీడలు శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఖేలో ఇండియా నిధులతో స్టేడియం అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాబోయే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, గ్రామంలో క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అమరావతి చట్టబద్ధత నేపథ్యంలో ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం కావడం విశేషమన్నారు. స్టేడియం అభివృద్ధిని మూడు దశల్లో చేపట్టి అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు.
నిధుల వివరాలను వెల్లడిస్తూ, ఖేలో ఇండియా ద్వారా రూ.20 కోట్లు, శాప్ ద్వారా రూ.20 కోట్లు, మిగిలిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం మరియు మున్సిపల్ పరిపాలన ద్వారా సమకూరనున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన క్రీడా అభివృద్ధి పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయని, గుంటూరు తర్వాత త్వరలో శ్రీకాకుళంలో కూడా పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని, అమరావతి రాజధాని స్థిరీకరణతో మరింత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లో క్రీడా వసతులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ, స్టేడియం అభివృద్ధిలో ఎంపీ కీలక పాత్ర పోషించారని చెప్పారు. వచ్చే ఏడాది నాటికి స్టేడియం రూపురేఖలు పూర్తిగా మారి అంతర్జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలకు వేదికగా మారుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తదితరులు పాల్గొన్నారు.



