తాజా వార్తలు

10/recent/ticker-posts

మహిళల భద్రతకు కఠిన చట్టాలు – అవగాహనతోనే నేరాల నివారణ: పెదపాడు అవగాహన కార్యక్రమంలో అధికారుల సూచనలు


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు అవగాహన అత్యంత కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు పెదవేగి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో పెదపాడు ఎస్సై ఆర్. శ్రీనివాస్, స్థానిక తహశీల్దార్ ఏ. కృష్ణజ్యోతి సంయుక్తంగా మహిళలపై జరిగే నేరాల నివారణ, రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎస్సై ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, దాడులు లేదా మర్యాదకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే నూతన చట్టాల ప్రకారం కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, నిర్ణీత కాలపరిమితిలో విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించడం పోలీసుల ముఖ్య బాధ్యతగా పేర్కొన్నారు.

మహిళలు, బాలికలు అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందేందుకు వివిధ హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. 112 ద్వారా పోలీస్ ఎమర్జెన్సీ సేవలు, 1098 ద్వారా చైల్డ్ హెల్ప్‌లైన్, 181 ద్వారా మహిళల హెల్ప్‌లైన్, 1930 ద్వారా సైబర్ నేరాలపై ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని వివరించారు. అదేవిధంగా ప్రతి మహిళ తన స్మార్ట్‌ఫోన్‌లో “శక్తి యాప్”ను ఇన్‌స్టాల్ చేసుకుని అవసరమైనప్పుడు వెంటనే పోలీసుల సహాయం పొందాలని సూచించారు.

తహశీల్దార్ ఏ. కృష్ణజ్యోతి మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా అధికారులను సంప్రదించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ధైర్యంగా ముందుకు రావాలని అధికారులు భరోసా ఇచ్చారు.

చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా సమాజంలో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించవచ్చని, పోలీసు మరియు రెవెన్యూ శాఖలు ఎల్లప్పుడూ సహకరించడానికి సిద్ధంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొని అధికారుల సూచనలను ఆసక్తిగా వినిపించారు.