ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజల రక్షణ, భద్రతే ప్రధాన లక్ష్యమని ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడివాకలంక గ్రామంలో రూరల్ పోలీసు సిబ్బందితో కలిసి ఆమె అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్తులతో నేరుగా మాట్లాడి పలు సామాజిక అంశాలు, నూతన చట్టాలపై వివరించారు.
ఈ సందర్భంగా జయ శర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మంచినీటి సరస్సు కొల్లేరు ప్రాంత ప్రజలు చేపల వేట, వ్యాపారంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని కొనియాడారు. అయితే జీవనోపాధి సాధనలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చేపల రవాణా సమయంలో లారీలపై అజాగ్రత్తగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణం చేయకూడదని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, శిరస్త్రాణం ప్రాణరక్షక కవచమని గుర్తుంచుకోవాలని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.
సైబర్ నేరాలపై కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. జనాభా లెక్కల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా ఫోన్ చేసి ఆధార్, బ్యాంకు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని తెలిపారు. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో 112 పోలీస్ సహాయం, 1098 చైల్డ్ హెల్ప్‌లైన్, 181 మహిళల హెల్ప్‌లైన్ నంబర్లను ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో సేవ్ చేసుకోవాలని తెలిపారు. నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
కొల్లేరు ప్రాంత ప్రజలు ఆర్థికంగా ఎదుగుతూ భద్రతా నియమాలను పాటించి సురక్షిత జీవనం గడపాలని పోలీసు అధికారులు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ ప్రజలు చురుకుగా పాల్గొని పోలీసుల సూచనలను స్వాగతించారు.



