ఏలూరు జిల్లా, కైకలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: ఈ నెల 09న మధ్యాహ్న సమయంలో కైకలూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్న బంగారు దుకాణంలో దొంగతనం యత్నం జరిగిన ఘటనను పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
దుకాణ యజమాని గుర్రం సత్య వినోద్ ఫిర్యాదు మేరకు, షాపు తాళాలు పగులగొట్టేందుకు ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తిపై కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కైకలూరు కోర్టుకు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన అలవాటుపడిన నేరస్తుడిగా గుర్తించారు.
నిందితుడు వివరాలు:
గొర్రెల సత్యనారాయణ (37), తండ్రి త్రిమూర్తులు, తూర్పు కాపు, ఐ. భీమవరం గ్రామం, ఆకివీడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.
ఈ కేసు ఛేదనలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు సీఐ ఏ.వి.ఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సై డి. వెంకట్ కుమార్ మరియు సిబ్బంది ప్రత్యేకంగా కృషి చేశారు.
పోలీసుల సూచనలు:
వేసవి కాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్నందున, బంగారు దుకాణ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా:
* సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
* బలమైన తాళాలు ఉపయోగించాలి
* షట్టర్లకు సైరన్‌లు, సెన్సార్‌లు అమర్చాలి
దుకాణాల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పోలీసులు హెచ్చరించారు.


