తాజా వార్తలు

10/recent/ticker-posts

మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబానికి ఆర్థిక సాయం – ఎస్పీ చేతుల మీదుగా చెక్కు అందజేత


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన సిబ్బంది కుటుంబాలకు అండగా నిలవడంలో ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ తెలిపారు.


ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో, పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన క్లెయిమ్ మొత్తాన్ని, గతంలో భీమవరం డీఏఆర్‌లో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ 12.12.2005న మరణించిన ఐ.కే.డి.వి. ప్రసాద్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

సొసైటీ సభ్యుడిగా ఉన్న ప్రసాద్ గారికి రావలసిన షేర్ అమౌంట్, త్రిఫ్ట్ డిపాజిట్ మొత్తాలను లెక్కించి, ఆయన తీసుకున్న రుణ బకాయిలను మినహాయించిన తరువాత మిగిలిన నికర మొత్తం రూ. 92,479/- చెక్కును ఆయన భార్య, కుమారునికి ఎస్పీ స్వయంగా అందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్నప్పుడు మరణించిన లేదా పదవీ విరమణ పొందిన సిబ్బందికి అందవలసిన ప్రయోజనాలను ఎటువంటి ఆలస్యం లేకుండా అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు, ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్య పరిష్కరించబడటంతో, దివంగత ప్రసాద్ కుటుంబ సభ్యులు ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.