తాజా వార్తలు

10/recent/ticker-posts

పట్టుదలతో చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం – యువతకు పెదవేగి ఇన్‌స్పెక్టర్ పిలుపు


దెందులూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: నేటితరం యువత పట్టుదల, క్రమశిక్షణతో కృషి చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పెదవేగి ఇన్‌స్పెక్టర్ శ్రీ సి.హెచ్. రాజశేఖర్ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ శ్రీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో దెందులూరు మండలం మసీదుపాడు గ్రామంలో యువతకు జాబ్ క్యాలెండర్‌పై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసే జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. ప్రామాణిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికే ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు.

ఉద్యోగాలు డబ్బులతో పొందవచ్చని చెప్పే మోసగాళ్ల మాటలను నమ్మవద్దని యువతను హెచ్చరించారు. అలాంటి అక్రమ మార్గాలను ఆశ్రయిస్తే డబ్బులు కోల్పోవడమే కాకుండా భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని తెలిపారు. ఎవరైనా ఉద్యోగాల పేరుతో మోసం చేయాలని ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

యువత సమయాన్ని వృథా చేయకుండా లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని, సరైన మార్గదర్శకంతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నేర చరిత్ర ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు ఆటంకం కలుగుతుందని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, గ్రామ పెద్దలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.