తాజా వార్తలు

10/recent/ticker-posts

హెల్మెట్ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి: భీమడోలు పోలీసులు ప్రత్యేక డ్రైవ్


భీమడోలు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామం సమీపంలోని NH-16 వద్ద పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. భీమడోలు ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్‌ఐ షేక్ మదీనా బాషా తమ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాలు, డీఎస్పీ శ్రీ డి. శ్రావణ్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో హెల్మెట్ ధరించని వాహనదారులకు అవగాహన కల్పించారు. జరిమానాలు విధించడం కంటే ముందుగా బాధ్యతను గుర్తుచేస్తూ, 30 మందికి హెల్మెట్లు కొనుగోలు చేయించి భద్రతపై చైతన్యం కల్పించారు. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తనిఖీల సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది యువతేనని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అతివేగం, నిర్లక్ష్యం, థ్రిల్ కోసం బైక్‌లను వేగంగా నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు.

ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకం కావచ్చని, హెల్మెట్ ధరించడం వల్ల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. కేవలం జరిమానాలు కాకుండా, వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే బాధలను వివరించారు.

పోలీసుల కీలక సూచనలు:
* ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలి
* నిర్ణీత వేగ పరిమితిని పాటించాలి
* మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు – ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై చర్యలు
* ప్రయాణంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదకరం

“మీ ప్రయాణం సురక్షితం కావాలి… మీ కుటుంబం మీ కోసం ఎదురు చూస్తోంది” అని పోలీస్ అధికారులు పేర్కొంటూ, ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.