తాజా వార్తలు

10/recent/ticker-posts

అంబేద్కర్ ఆశయాలే దిక్సూచి: కలెక్టర్


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: ఏప్రిల్ 14: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో అంటరానితనం, కుల వివక్షలను నిర్మూలించేందుకు అంబేద్కర్ గారు రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహానుభావుడు అంబేద్కర్ అని తెలిపారు.

న్యాయ కోవిదుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా అంబేద్కర్ చేసిన సేవలు అమోఘమని కలెక్టర్ కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించి అనేక అవమానాలు, వివక్షను ఎదుర్కొంటూ ఉన్నత స్థాయికి ఎదిగిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. సర్వమానవ సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.