ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 14: జిల్లా జంగారెడ్డిగూడెం డాంగే నగర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సంఘ సభ్యులు ఘనంగా నిర్వహిస్తూ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకున్నారు.
సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగా తమ తల్లి అమృతల దుర్గమ్మ జ్ఞాపకార్థం ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ గారు ప్రపంచ విజ్ఞానానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. సమానత్వం, మానవత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకరరావు మాట్లాడుతూ, యువత అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజంలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కె. లక్ష్మణరావు, కార్యదర్శి పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంకుంట శ్రీనివాస్, దాసరి నాగరాజు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


