తాజా వార్తలు

10/recent/ticker-posts

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకుల సాధనకు సమష్టిగా కృషి చేయాలి – కలెక్టర్ లక్ష్మీశ


విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు అన్ని విభాగాలు సమష్టిగా పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని ఆయన తెలిపారు.


విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ, కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్, జనగణన అంశాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డు నిలబెట్టుకోవడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే జనగణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, చీఫ్ సిటీ ప్లానర్, ఇంజినీరింగ్ విభాగ అధికారులు, జోనల్ కమిషనర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.