ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 08: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడను దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో సమష్టిగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. వినూత్న కార్యాచరణతో పాటు విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి గానూ బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మునిసిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యూఏలు), టెర్రాస్ గార్డెన్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాల అమలు, ప్రజల భాగస్వామ్యం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మెరుగైన ర్యాంక్ సాధించడం కంటే దానిని నిలబెట్టుకోవడం మరింత సవాలుగా ఉంటుందని అన్నారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా స్వచ్ఛతపై అవగాహనతో వ్యవహరించి తడి, పొడి చెత్తను వేరు చేయడం వంటి చర్యలను పాటించాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.
అదేవిధంగా నగరంలో హరిత విస్తీర్ణాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని, టెర్రాస్ గార్డెనింగ్‌ను ప్రోత్సహించాలని తెలిపారు. పార్కులు పట్టణ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్యమని, వాటి అభివృద్ధి, నిర్వహణలో ఆర్‌డబ్ల్యూఏలు చొరవ చూపాలని కోరారు. విజయవాడను గ్లోబల్ సిటీగా, హ్యాపీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, గతంలో ప్రజల భాగస్వామ్యంతో మంచి ర్యాంకులు సాధించామని, ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో మునిసిపల్ అధికారులు, ప్రజారోగ్య సిబ్బంది, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులు పాల్గొన్నారు.


