ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 8: యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన అభిమానులు ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటి బాబు, ఆర్టీసీ విజయవాడ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి ఘటనలు కుటుంబాలకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమాన హీరోల సందేశాలతో స్ఫూర్తి పొంది యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి మంచిదని తెలిపారు.
మాజీ ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో యువతకు మంచి సందేశాలు చేరాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వంటి ప్రమాదకర అలవాట్ల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. యువత సమాజానికి ఆదర్శంగా నిలిచి స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపడితే మంచి మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలకు రక్షణ కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అభిమాన సంఘ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


