కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలును మరింత పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వెలుగు విఓఏల పనిభారాన్ని తగ్గిస్తూ, వారికి ఆధునిక సదుపాయాలు కల్పించడం ద్వారా సేవలను ప్రజలకు త్వరగా అందించవచ్చని ఆయన తెలిపారు.
కొత్తపేటలోని సీవీఏపీ (Constituency Visionary Action Plan) కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆత్రేయపురం మండలానికి చెందిన 34 మంది వెలుగు వీఏఓలకు ఎమ్మెల్యే స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు. ఈ ఫోన్లతో పాటు స్క్రీన్ గార్డ్, ఛార్జర్, ఫోన్ కవర్, పౌచ్ వంటి అవసరమైన ఉపకరణాలను కూడా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ సులభమవుతుందని, లబ్ధిదారులకు సేవలు మరింత వేగంగా చేరుతాయని చెప్పారు. డిజిటల్ వ్యవస్థ ద్వారా పనితీరు మెరుగుపడి పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ చర్య గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతుందని, ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎల్‌డీఓ రాజేశ్వరరావు, వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ముళ్లపూడి భాస్కరరావు, కుసంపూడి రామకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.



