కొత్తపేట, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులైన సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం మరియు ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి దంపతులకు అంబాజీపేట మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. మంగళవారం ఉదయం వారి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నాయకుడికి జాతీయ స్థాయి గుర్తింపు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి ఎదిగి జాతీయ స్థాయికి చేరిన రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రయాణం ప్రతి కార్యకర్తకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన అనుభవం, పార్టీ పట్ల నిబద్ధత, నాయకత్వ లక్షణాలే ఈ కీలక బాధ్యతలకు కారణమని అభిప్రాయపడ్డారు.
రెడ్డి అనంత కుమారి సేవా దృక్పథం కూడా పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు. ముఖ్యంగా బీసీ వర్గాల అభివృద్ధి, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆమె చేపట్టే కార్యక్రమాలు సమాజానికి మేలు చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించడంలో ఈ దంపతుల పాత్ర కీలకమని చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ అధినేతలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలపడేలా అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
రెడ్డి అనంత కుమారి మాట్లాడుతూ, బీసీ వర్గాల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ కో-కన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, అంబాజీపేట మండల టీడీపీ అధ్యక్షుడు గూడాల ఫణి, అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ జయలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి రవణం రాము తదితరులు, పార్టీ నాయకులు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.



