తాజా వార్తలు

10/recent/ticker-posts

జేఈఈ మెయిన్స్‌లో టైలర్ కుమారుడికి ఆల్ ఇండియా 1,080వ ర్యాంక్


కోనసీమ, ఆలమూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామానికి చెందిన పేరూరి దివ్య నాగ మణికంఠ ఈశ్వరుడు ఆల్ ఇండియా స్థాయిలో 1,080వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ విద్యార్థి కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది.


చెముడులంక జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి వరకు విద్యనభ్యసించిన ఈశ్వరుడు, అనంతరం రాజమహేంద్రవరం చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అతని తల్లిదండ్రులు రవి, దేవి గ్రామంలో టైలరింగ్ వృత్తి నిర్వహిస్తూ “టిప్ టాప్ టైలర్”గా గుర్తింపు పొందారు. కష్టపడి జీవనం సాగించే కుటుంబం నుంచి వచ్చిన ఈ విద్యార్థి ఇంత మంచి ర్యాంక్ సాధించడం స్థానికంగా గర్వకారణంగా మారింది.

గత సంవత్సరం ఈశ్వరుడి అన్నయ్య రామ సురేష్ కూడా జేఈఈ మెయిన్స్‌లో 1,369వ ర్యాంక్ సాధించి అస్సాం రాష్ట్రంలోని సిల్చార్ ఎన్ఐటీ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇప్పుడు తమ్ముడు మరింత మెరుగైన ర్యాంక్ సాధించడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపైంది. ఈ ర్యాంక్‌తో దేశంలోని ప్రముఖ ఎన్ఐటీ కళాశాలలో ఈశ్వరుడికి సీటు దక్కే అవకాశం ఉంది.

అరుదైన విజయాన్ని సాధించిన ఈ విద్యార్థిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పిటీసీ తోరాటి సీతామహాలక్ష్మి తదితరులు అభినందించారు. గ్రామస్థులు, స్నేహితులు కూడా ఈశ్వరుడి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, అతని భవిష్యత్తు మరింత उज్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.