తాజా వార్తలు

10/recent/ticker-posts

డీజిల్ కొరత లేదు… వదంతులు నమ్మొద్దు: కలెక్టర్


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: జిల్లాలో డీజిల్ కొరత ఉందన్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, ఆందోళనతో అధికంగా కొనుగోలు చేయకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. డీజిల్ సరఫరా అంశంపై సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో వివిధ శాఖల అధికారులకు ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో సాధారణ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల వల్ల ప్రజలు ఒకేసారి అధికంగా ఇంధనం కొనుగోలు చేయడం వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని 152 పెట్రోల్ బంకుల వద్ద సక్రమ సరఫరా కోసం విఆర్ఓ స్థాయి సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. డీజిల్ కొరత లేదని ప్రజలకు వివరించి, అవసరానికి మించి కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బంకుల్లో నిల్వలు పూర్తిగా అయిపోయేంత వరకు వేచి ఉండకుండా, ఒక రోజు ముందుగానే ఆయిల్ కంపెనీలకు ట్యాంకర్ల కోసం ఇండెంట్ పెట్టాలని యజమానులకు సూచించారు.

డీజిల్ డిమాండ్, సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9491041419 మరియు టోల్ ఫ్రీ 1800 2331077 నంబర్ల ద్వారా ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. రెండు గంటలకు ఒకసారి నిల్వలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రబీ ధాన్యం రవాణా వాహనాలు, ఆక్వా రంగానికి ప్రాధాన్యతగా డీజిల్ సరఫరా చేయాలని, ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించాలని కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా, అవసరమైన మేరకు మాత్రమే డీజిల్ కొనుగోలు చేయాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.