తాజా వార్తలు

10/recent/ticker-posts

ఇంధన కొరత లేదు… వదంతులు నమ్మొద్దు: జేసీ ఇలక్కియా


విజయవాడ, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: ఇంధన ధరలు పెరుగుతాయనే వదంతులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం వల్లే వాహనదారులు అనవసరంగా ఎక్కువగా ఇంధనం కొనుగోలు చేస్తున్నారని ఆమె తెలిపారు.


జిల్లాలో మొత్తం 186 పెట్రోల్ బంకుల ద్వారా నిరంతరంగా ఇంధన సరఫరా జరుగుతోందని, ఎటువంటి కొరత లేదని ఆమె వివరించారు. సాధారణ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం సుమారు 20 శాతం అదనంగా సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. కొండపల్లి ప్రాంతంలోని సరఫరా సంస్థలతో సమన్వయం చేసుకొని అవసరమైన మేరకు ఇంధనాన్ని అందిస్తున్నామని తెలిపారు.

ఇటీవలి రోజుల్లో ప్రజలు ఒకేసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా 30 నుంచి 50 శాతం వరకు పెరిగిందని, దీంతో కొంతమంది బంకుల్లో తాత్కాలికంగా “నో స్టాక్” బోర్డులు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఇది సరఫరా లోపం వల్ల కాకుండా ప్రజల ఆందోళన కారణంగానే ఏర్పడిన తాత్కాలిక పరిస్థితి అని స్పష్టం చేశారు.

ప్రతి పెట్రోల్ బంక్ వద్ద క్రమబద్ధమైన సరఫరా కోసం క్యూలైన్‌లు ఏర్పాటు చేశామని, పోలీస్ మరియు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో సరఫరా జరుగుతోందని తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని బంకులను నిరంతరం తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు.

వ్యవసాయం, ఆక్వా రంగం, ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలకు ప్రాధాన్యతగా డీజిల్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కమర్షియల్ వినియోగదారులు కూడా రిటైల్ బంకుల వద్దకు రావడం వల్ల కొంతమేర డిమాండ్ పెరిగిందని తెలిపారు. కొన్ని ప్రైవేట్ బంకుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్న అంశంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రజలు పానిక్‌కు గురికాకుండా అవసరానికి తగినంత మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, వదంతులను నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454ను సంప్రదించవచ్చని తెలిపారు.