ఏలూరు, పశ్చిమ వాహిణి, ఏప్రిల్ 13: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నా కేంటీన్లను రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, కేంటీన్ల పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా అధికారులు నేరుగా ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆహారం రుచి, నాణ్యత, సిబ్బంది ప్రవర్తనపై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించారు. ముఖ్యంగా ప్రజలతో కలిసి భోజనం చేస్తూ సేవలపై ప్రత్యక్షంగా అవగాహన పొందడం విశేషంగా నిలిచింది.
జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు తంగెళ్లమూడి అన్నా కేంటీన్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజలతో కలిసి భోజనం చేస్తూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంటీన్ పరిసరాల్లో పరిశుభ్రతను కూడా తనిఖీ చేశారు.
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ఏలూరు ఇండోర్ స్టేడియం సమీపంలోని మరియు ఆర్.ఆర్.పేటలోని అన్నా కేంటీన్లను తనిఖీ చేసి సేవల నాణ్యతను పరిశీలించారు. నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న కూడా స్థానిక అన్నా కేంటీన్‌ను సందర్శించి స్వయంగా ఆహారం రుచి చూసి, పరిశుభ్రతను పరిశీలించారు.
అలాగే ఏలూరు ఆర్డీఓ రామకోటి సెంటర్‌లోని కేంటీన్‌ను తనిఖీ చేయగా, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ మునిసిపల్ కార్యాలయం వద్ద గల కేంటీన్‌ను పరిశీలించారు. అధికారులు అన్నిచోట్లా ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.
తనిఖీలలో పాల్గొన్న ప్రజలు… అన్నా కేంటీన్లలో ఆహారం రుచిగా ఉందని, సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తున్నారని, పరిసరాలు కూడా పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారని అధికారులకు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.


