ఏలూరు, పశ్చిమ వాహిణి, ఏప్రిల్ 13: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పిజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలను జవాబుదారీతనంతో, నిర్దిష్ట గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారంపై అక్కడికక్కడే సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలు సమర్పించే ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపడం అధికారుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, రీఓపెన్ అయ్యే పరిస్థితి లేకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధతో విచారణ జరిపి, నిర్దేశిత సమయంలోగా సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి, సర్వే శాఖ ఏడి అన్సారీ తదితరులతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 237 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
అందిన అర్జీలలో పలు సమస్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కలిదిండి మండలం వెలంపేటకు చెందిన కె. వెంకటరామ్ ప్రసాద్ ఏలూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా, పెదవేగి మండలం లక్ష్మీపురానికి చెందిన దాసరి రాములమ్మ దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భూమి ఫోర్జరీ, రహదారి ఆక్రమణలు, వ్యవసాయ భూములకు మార్గం సమస్యలు, చెరువుల అక్రమ రిజిస్ట్రేషన్లపై కూడా ఫిర్యాదులు వచ్చాయి.
అదేవిధంగా ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన నందిగం చిట్టిబాబు తన పొలానికి వెళ్లే దారి మూసివేశారని ఫిర్యాదు చేయగా, నూజివీడు మండలం పల్లెర్లమూడికి చెందిన పరిమి మరియా దాసు ఔషధ గుణాలు ఉన్న తిప్పతీగ పంట సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు. ఈ అన్ని అర్జీలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.


