ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా అధికార యంత్రాంగం తరఫున కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శుభాభినందనలు తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 34,510 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 29,103 మంది ఉత్తీర్ణత సాధించి 84 శాతం ఫలితాలు నమోదు అయ్యాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 36,151 మంది హాజరై, 31,453 మంది ఉత్తీర్ణులై 87 శాతం ఫలితాలు సాధించారు. మొత్తంగా జిల్లాలో 85 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ప్రథమ సంవత్సరంలో 84 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానం, ద్వితీయ సంవత్సరంలో 87 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానం సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి. ప్రభాకరరావు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో అద్భుత విజయాలు సాధించిన విద్యార్థులతో పాటు వారిని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు, అధికారులను అభినందించారు. కష్టపడి చదివి విజయం సాధించిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు.
అలాగే ఆశించిన ఫలితాలు రాని విద్యార్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలను మరో అవకాశంగా తీసుకుని మరింత కృషితో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. విద్యార్థులు తమ బలహీనతలను గుర్తించి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదివితే తప్పకుండా విజయం సాధించగలరని తెలిపారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యం చెప్పి ప్రోత్సహించాలని కోరారు. ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించదని, పట్టుదలతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరికీ విజయావకాశాలు ఉంటాయని కలెక్టర్ డా. లక్ష్మీశ స్పష్టం చేశారు.



