ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 15: ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఆయన, పథకం అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో సిద్ధం చేసిన భోజనాన్ని స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆహార నాణ్యత, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం పోషక విలువలతో ఉండి, ప్రభుత్వ మెనూ ప్రకారం అందుతున్నదో లేదో పరిశీలించారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకొని, వచ్చిన సూచనలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతం, విద్యా పురోగతికి కీలకమని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఈ పథకం సమర్థవంతంగా అమలు కావాలని స్పష్టం చేశారు.
పోషకాహారం అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని, పరిశుభ్రత మరియు నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులకు హెచ్చరించారు. ఏ చిన్న లోపం ఉన్నా సహించబోమని, భవిష్యత్తులో కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని కలెక్టర్ డా. లక్ష్మీశ స్పష్టం చేశారు.


