తాజా వార్తలు

10/recent/ticker-posts

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి


కర్నూలు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 16: జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలిక ఉన్నారు.


దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం: కర్ణాటకలోని చిక్‌మంగళూరుకు చెందిన భక్తులు మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బొలేరో లో 23 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

చిలకలడోన గ్రామం దగ్గర జాతీయ రహదారి 167 పైన రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్​ నుంచి టుముకూరు వెళ్తున్న రెడీమిక్స్‌ లారీని ఎదురుగా వస్తున్న, మంత్రాలయం వెళ్తున్న అశోక్​ లేలాండ్​ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఐదుగురు మహిళలు, మూడు సంవత్సరాల వయసున్న బాలిక, ఇద్దరు మగవాళ్లు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఏడుగుర్ని కర్నూలుకు తరలించగా, మరో నలుగురు ఎమ్మిగనూరులో చికిత్స పొందుతున్నారు. ఒక వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు దర్యాప్తులో తెలుస్తాయి.

మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి
ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ఆయన.. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి అధికారులను స్పష్టంగా ఆదేశించారు.