జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: రైతుల సంక్షోభానికి పరిష్కారం కోసం మద్దతు ధరలకు గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఉద్దరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యకిరణ్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదస్సుకు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
సదస్సు ప్రారంభంలో రైతాంగ పోరాట యోధుడు ఉద్దరాజు రామం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ ధావలే మాట్లాడుతూ రైతుల సమస్యలు గత కొన్నేళ్లుగా మరింత తీవ్రంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నప్పటికీ పంటలకు సరైన మద్దతు ధరలు లభించక రైతులు నష్టపోతున్నారని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని, ఇందుకు చట్టబద్ధమైన గ్యారెంటీ అవసరమని తెలిపారు.
దేశవ్యాప్తంగా భూసంస్కరణలు అమలు చేయాలని, భూమిలేని రైతులకు భూములు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెట్టాలని కోరారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల రుణాలను లక్షల కోట్ల రూపాయల మేర మాఫీ చేస్తోందని, కానీ రైతుల రుణాల విషయంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. రైతులు, కార్మికులు ఐక్యంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి 200 రోజులు పని, రూ.700 వేతనం కల్పించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ, మంతెన సీతారాం, ఎ. రవి, డి.ఎన్.వి.డి. ప్రసాద్, ఎం. నాగమణి, పి. రామకృష్ణ, పోలోజు నాగేశ్వరరావు, కట్టా భాస్కరరావు, పి. రామరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు తమ సమస్యలపై అశోక్ ధావలేకు వినతిపత్రం సమర్పించారు.


