తాజా వార్తలు

10/recent/ticker-posts

గోకుల తిరుమలలో భక్తుల రద్దీ – శనివారం ప్రత్యేక దర్శనం


జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: వేసవి సెలవులు మరియు శనివారం సందర్భంగా గోకుల తిరుమల పారిజాత గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల రద్దీ వెల్లివిరిసింది. జంగారెడ్డిగూడెం ఉత్తర దిశలోని ఏడుకొండల్లో ఆరో కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామునే సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్టి, బాలభోగి నివేదన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.


ప్రత్యేక అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచే గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు పెద్ద సంఖ్యలో కాలినడకన చేరుకున్నారు. విద్యార్థులు, యువత దీక్షలు చేపట్టి ప్రత్యేక దర్శనాలు, అష్టోత్తర పూజలు నిర్వహించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. సంతానం కలిగితే తులాభారం సమర్పిస్తామని మొక్కుకున్న భక్తులు పట్టిక బెల్లంతో తులాభారం నిర్వహించారు.

జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన భక్తులు కోలాటం కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. వేలాదిగా వచ్చిన భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించగా, సముద్రపు రామకృష్ణ, నరసింహారావు, కోడూరి వెంకట్రావు, వల్లభనేని శ్రీనివాసరావు అన్నదాతలుగా సేవలందించారు. వీరిని ఆలయ అర్చకులు శేషవస్త్రాలు, ప్రసాదాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్త నాగరాజు తదితర ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు వారికి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

ఈ రోజు పూజా టికెట్లు, ప్రసాదాల విక్రయం, విరాళాలు, అన్నదానం ద్వారా సుమారు రూ.99,000 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కలగర శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.