చింతలపూడి, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 25: యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ మార్గాలను ఆశ్రయించవద్దని యువతకు హితవు పలికారు. శనివారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా కేటాయించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కార్యాలయాన్ని పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం కనిపిస్తోందని పేర్కొంటూ సీఐ క్రాంతికుమార్‌ను అభినందించారు.
యువత సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ మోసాల వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి చర్యలు వ్యక్తిగతంగా మాత్రమే కాక సమాజానికీ హానికరమని తెలిపారు. యువత తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టి చట్టబద్ధ మార్గాల్లో ముందుకు సాగాలని కోరారు.
ప్రజల రక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి పనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికత వినియోగం కీలకమని, ఇది నేర పరిశోధనకు ఎంతో దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు.


