కడియం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కడియం మండలంలో కూటమి నేతలు మహాధర్నా నిర్వహించారు. అధికారం కోల్పోయినా వైయస్సార్సీపీ నాయకుల అరాచకాలు కొనసాగుతున్నాయని ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ విమర్శించారు. సాక్షి మీడియా ద్వారా అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ కడియం గ్రామంలో భారీ నిరసన చేపట్టారు.
మండల పరిషత్ అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహాధర్నాకు రాజమహేంద్రవరం రూరల్ మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కుల వివాదాలను రెచ్చగొట్టేలా సాక్షి పత్రికలో కథనాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు.
కాపులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ, తప్పుడు రీతిలో చూపించడం రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అభివృద్ధిలో ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలకు దిగడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలు కొనసాగితే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.
అనంతరం కడియం టీడీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరిన నాయకులు బొబ్బిలి బ్రిడ్జి సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ దిష్టిబొమ్మను దహనం చేసి, సాక్షి పత్రిక ప్రతులను తగలబెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కడియం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సాక్షి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, కడియం రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వెలుగుబంటి నాని, మత్స్యేటి ప్రసాద్, జనసేన మండల అధ్యక్షుడు ముద్రగడ జమ్మి, బీజేపీ మండల అధ్యక్షుడు బొరుసు సుబ్రమణ్యం, అలాగే ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



