తాజా వార్తలు

10/recent/ticker-posts

జేగురుపాడులో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు – గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం


కడియం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: గ్రామీణ పరిపాలనకు పునాది పంచాయతీరాజ్ వ్యవస్థ అని డిప్యూటీ ఎంపీడీవో శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. కడియం మండలం జేగురుపాడు పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్‌గా శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు గ్రామస్థాయి పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.

ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి గ్రామాలే వెన్నెముకగా నిలుస్తాయని పేర్కొన్నారు. యువత గ్రామ అభివృద్ధిపై అవగాహన పెంపొందించుకుని పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. గ్రామంలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందాలని సూచించారు.

గ్రామ అభివృద్ధికి పరస్పర సహకారం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పాలపర్తి ప్రకాష్ కుమార్, కర్రి చిన్నబాబు, వనమాలి వెంకట బాలాజీ, మాన్యం చంద్రమోహన్, కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.