కడియం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: మండల కేంద్రం కడియం గ్రామంలోని మేకలదిబ్బ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల-4లో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చిరుకూరి ప్రభ ఆధ్వర్యంలో జరగగా, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్‌లకు బానిసలుగా మారకుండా క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని కోరారు. విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, దేశ ప్రగతికి చదువు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం స్థానిక నాయకుడు చిరుకూరి ప్రభ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యా, క్రీడా రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ పి. నాగలక్ష్మి, ప్రధానోపాధ్యాయిని బి. విజయ, ఉపాధ్యాయులు బంగార్రాజు, ఆర్.ఎస్.ఎన్. మూర్తి, చంద్రశేఖర్, రమాప్రభ, సి.ఆర్.పీ శ్రీనివాస్, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



