కైకలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 26: కృష్ణా జిల్లా కైకలూరులోని కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం చేయడానికి ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం… తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కైకలూరు మెయిన్ రోడ్డులో ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలోకి చొరబడి యంత్రాన్ని పగులగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అయితే ఏటీఎం మెషిన్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.
ఉదయం బ్యాంక్‌కు వచ్చిన స్వీపర్ ఈ విషయాన్ని గమనించి మేనేజర్‌కు సమాచారం అందించగా, వారి ఫిర్యాదు మేరకు కైకలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో నిందితుడు ఏటీఎంను చేతులతో ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలను సేకరించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, వందలం నాగరాజు (32)గా గుర్తించారు. అతను అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కించూరు గ్రామానికి చెందినవాడని తెలిపారు.
పోలీసుల విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం… తాను భుజబలపట్నం గ్రామంలో రొయ్యల చెరువులో పని చేసేవాడని, యజమానితో వివాదం కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోతూ కైకలూరు రైల్వే స్టేషన్ వద్ద దిగాడని తెలిపాడు. ట్రైన్ కోసం వేచి ఉండగా మద్యం మత్తులో ఏటీఎంలోకి వెళ్లి ముందుగా ఆధార్ కార్డు ఉపయోగించి డబ్బులు తీసుకోవాలని ప్రయత్నించాడని, అది సాధ్యంకాకపోవడంతో ఏటీఎంను పగులగొట్టి డబ్బులు దొంగిలించాలనుకున్నానని ఒప్పుకున్నాడు.
అయితే యంత్రం పూర్తిగా తెరుచుకోకపోవడంతో డబ్బులు దొరకకపోవడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించాడు.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, తదుపరి చర్యలు చేపట్టారు.


