తాజా వార్తలు

10/recent/ticker-posts

ట్రాన్స్‌ఫార్మర్ చోరీ గ్యాంగ్ అరెస్ట్…160 కేజీల రాగి వైరు స్వాధీనం


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: చింతలపూడి పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి రాగి వైరు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, సుమారు 160 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ శ్రీమతి ఆర్. సుస్మిత ఐపీఎస్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


ఏప్రిల్ 17న చింతలపూడి NVN కాలనీ సమీపంలోని పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి రాగి వైరు దొంగిలించిన ఘటనపై ఎలక్ట్రికల్ ఏఈ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ సుస్మిత పర్యవేక్షణలో చింతలపూడి సీఐ టి. క్రాంతి కుమార్, ఎస్సై కె. సతీష్ కుమార్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో నిందితులుగా చుండ్రు అనిల్ కుమార్ @ సన్నీ (27), యామర్ల వీరాంజనేయులు @ వీరబాబు (31), అందుగుల వెంకటేశ్వరరావు (52), షేక్ హుస్సేన్ పాషా (40)తో పాటు ఒక మైనర్ బాలుడిని గుర్తించారు. వీరి వద్ద నుండి చింతలపూడి పరిధిలో నమోదైన 10 కేసులకు సంబంధించిన 19 ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి దొంగిలించిన రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేసును చాకచక్యంగా చేధించి నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సై మరియు సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్ల వరుస చోరీలకు తెరపడిందని ఆమె పేర్కొన్నారు.