జంగారెడ్డిగూడెం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 27: పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సోమవారం సందర్భంగా శ్రీ నర్మదా అమృత బాణ లింగేశ్వర స్వామివారికి ఉచిత పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద పంచలోహ ఉత్సవ లింగానికి వైశాఖ మాసం శుక్లపక్ష ఏకాదశి సోమవారం సందర్భంగా ప్రధాన అర్చకులు కాళ్లకూరి శంకర్ మహేష్ శర్మ బృందం పంచామృతాభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ చిటికెన రాంబాబు మాట్లాడుతూ… 2019 మే 19న చండీ హోమంతో ఆలయ ప్రతిష్ఠ జరగిందని, అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి ఆనవాయితీగా చండీ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆశ్వయుజ, కార్తీక, మాఘ, వైశాఖ మాసాల పౌర్ణములు విశేషమైనవిగా శాస్త్రాలు పేర్కొంటాయని చెప్పారు.
వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని మే 1, 2026 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 87వ చండీ హోమం లోకకల్యాణార్థం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ హోమంలో పాల్గొనదలచిన భక్తులు ఆలయ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండితో సగభాగం వెండి చీర తయారు చేసి ఉగాది సందర్భంగా అలంకరించామని, మిగిలిన భాగం పూర్తి చేయడానికి భక్తులు వెండి లేదా నగదు రూపంలో సహకరించాలని కోరారు.
భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవా బృందాలు, పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


