తాజా వార్తలు

10/recent/ticker-posts

గోశాలకు వరిగడ్డి కట్టల విరాళం – దాత ఉప్పులూరి హనుమంతరావు సేవా కార్యక్రమం


కడియం, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 21: మండల కేంద్రం కడియం గ్రామంలో ఉన్న భ్రమరాంబికా మల్లేశ్వరస్వామి వారి గోశాలకు స్థానిక దాత ఉప్పులూరి హనుమంతరావు తన సేవాభావాన్ని చాటుకున్నారు. గోవుల సంరక్షణ కోసం రూ.15 వేల విలువైన వరిగడ్డి కట్టలను విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ వరిగడ్డి కట్టలను ఆయన కుమారుడు మాణిక్యం (తాతాజీ) ద్వారా గోశాల సంరక్షణ సమితి అధ్యక్షుడు గిరజాల బాబు చేతుల మీదుగా అందించారు.


ఈ సందర్భంగా గోశాల సంరక్షణ సమితి అధ్యక్షుడు గిరజాల బాబు మాట్లాడుతూ, గోవుల సంరక్షణ కోసం ముందుకు వచ్చిన దాత హనుమంతరావు కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, మరిన్ని మంది దాతలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. గోశాలలో ఉన్న గోవుల పోషణకు వరిగడ్డి వంటి అవసరాలు ఎంతో కీలకమని తెలిపారు.

కార్యక్రమంలో స్థానికులు, సేవా భావం కలిగిన వ్యక్తులు పాల్గొని దాతను అభినందించారు. గోశాల అభివృద్ధి కోసం గ్రామస్థులు కలిసికట్టుగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వంగపండు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.