తాజా వార్తలు

10/recent/ticker-posts

సౌరీపురంలో పోలీసుల అవగాహన సమావేశం – మహిళల భద్రత, డ్రగ్స్ నివారణపై విస్తృత చర్చ


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 24: మహిళలు, బాలికల భద్రతతో పాటు సమాజంలో నేరాల నివారణకు ప్రజలలో అవగాహన పెంపు అవసరమని పోలీసులు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఏలూరు త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ఈగల్ టీం ఆర్‌ఎస్‌ఐ ఉదయభాస్కరరావు సిబ్బందితో కలిసి సౌరీపురంలో అవగాహన సమావేశం నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నివారణ, నూతన క్రిమినల్ చట్టాలపై అవగాహన, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు వివరించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టపరమైన రక్షణలు, అత్యవసర పరిస్థితుల్లో 112 ద్వారా పోలీసులను ఎలా సంప్రదించాలి, నేరాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు.

నూతన క్రిమినల్ చట్టాల్లో వచ్చిన మార్పులు, వాటి అమలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై స్పష్టత ఇచ్చారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సానుకూల జీవన లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈగల్ టీం ద్వారా డ్రగ్స్ నివారణపై ప్రత్యేకంగా చైతన్యం కల్పిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మహిళా పోలీస్ స్టేషన్ మరియు ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని అవగాహన పొందారు. సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు.