ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: జిల్లాలో రైతుల అవసరాలే ప్రథమ ప్రాధాన్యమని, డీజిల్ ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాలకు తరలిపోకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ నుండి అధికారులు, తహశీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, జిల్లాలో డీజిల్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లాలో ప్రస్తుతం డీజిల్ కొరత లేకుండా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు మరియు ప్రజల అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. వదంతులు నమ్మి ప్రజలు పానిక్ కొనుగోళ్లు చేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రబీ సీజన్‌లో వరి కోత యంత్రాలు, వ్యవసాయ అవసరాలు, ఆక్వా రైతుల అవసరాలకు ప్రాధాన్యతగా డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగాలని ఆదేశించారు. అధిక డిమాండ్ ఉన్న పెట్రోల్ బంకులకు ట్యాంకర్లు పంపేలా చర్యలు తీసుకోవాలని, బంక్‌ల వద్ద సిబ్బందిని నియమించి డీజిల్ పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు.
ప్రత్యేకంగా జిల్లా మరియు రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసి, డీజిల్ బయటకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతు సేవా కేంద్రాల సిబ్బంది తమ పరిధిలోని రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి, వారికి అవసరమైన డీజిల్ అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా రైతులు లేదా ఆక్వా రైతులు డీజిల్ సమస్యలు ఎదుర్కొంటే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అలాగే, పెట్రోల్ బంక్ యజమానులు నిల్వలు పూర్తయ్యేలోపు ముందుగానే ఇండెంట్లు పెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు కిషోర్, రమణ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, ఉద్యానవన అధికారి షాజా నాయక్ తదితరులు పాల్గొన్నారు.


