తాజా వార్తలు

10/recent/ticker-posts

ఏలూరు జిల్లాలో ఆటోమేటెడ్ వాహన టెస్టింగ్ స్టేషన్ ప్రారంభం – రోడ్డు భద్రతకు కొత్త దశ


ఏలూరు/పెదపాడు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 29: వాహన ప్రమాదాలు నివారించి ప్రజలు సురక్షితంగా ప్రయాణించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.


పెదపాడు మండలం కలపర్రు ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద రూ.3.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పద్మవో ఆటో టెక్ సర్వీసెస్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS)ను మంత్రి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల ఫిట్‌నెస్‌ను ఖచ్చితంగా, పారదర్శకంగా పరీక్షించేందుకు ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో మాన్యువల్‌గా జరిగే పరీక్షల స్థానంలో ఇప్పుడు స్వయంచాలక యంత్రాల ద్వారా వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

కొత్త విధానంలో 9 రకాల పరీక్షలు పూర్తి చేసిన వెంటనే నిమిషాల్లోనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందవచ్చని వివరించారు. ద్విచక్ర వాహనాల నుంచి లారీలు, జేసీబీల వరకు అన్ని వాహనాలకు ఈ పరీక్షలు తప్పనిసరి అవుతాయని చెప్పారు. ఈ విధానం వల్ల వాహనాల నాణ్యత మెరుగుపడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.

లాభాపేక్ష లేకుండా ఏపీఎస్ ఆర్టీసీ, రవాణా శాఖలో వినూత్న మార్పులు తీసుకువస్తూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ…
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో నూతన దశ ప్రారంభమైందని అన్నారు. ఆధునిక సాంకేతికతతో వాహనాల భద్రత మరింత మెరుగుపడుతుందని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ ఎస్.కె. కరీం, జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్.కె. షబ్నమ్, సెట్‌వెల్ సీఈఓ కె.ఎస్. ప్రభాకరరావు, ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, రవాణా శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు, సంస్థ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Photo Gallery - Click Here