ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: ఏలూరులో నిర్వహించిన రైతు సంపద సహజ మరియు సేంద్రీయ ఆహార ఉత్పత్తుల రెండు రోజుల మెగా మేళా ఘన విజయం సాధించిందని జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ నెల 18, 19 తేదీలలో జరిగిన ఈ మేళా రాష్ట్రంలోనే మొదటిసారిగా నిర్వహించబడగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి ఏలూరు జిల్లాను ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది రైతులు పాల్గొని, 180 రకాల సేంద్రీయ ఆహార ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించారు. రెండు రోజులలో సుమారు 3,400 మంది ప్రజలు మేళాను సందర్శించగా, మొత్తం రూ.11 లక్షల వరకు విక్రయాలు జరిగినట్లు తెలిపారు. సేంద్రీయ వ్యవసాయంపై కృషి చేస్తున్న రైతులకు ఇది తొలి పెద్ద విజయంగా నిలిచిందని కలెక్టరు పేర్కొన్నారు.
ఈ మెగా మేళాను విజయవంతం చేయడంలో కృషి చేసిన అధికారులను కలెక్టరు అభినందించారు. వ్యవసాయ శాఖ జెడి యస్.కె. హమీబ్ భాషా, ఏపీ ఎంఐపీ పీడీ డా.యస్. రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె. షాజా నాయక్, డిఆర్డిఏ పీడీ టి.వి. విజయలక్ష్మి, మెప్మా పీడీ యం. రాజబాబును ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్. దేవకీదేవి, ఇంచార్జి ఆర్డీవో ఐ. కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె. భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.



