ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 20: జిల్లాలో కొబ్బరి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని “కేర సురక్ష ఇన్సూరెన్స్ పథకం 2026-27” గోడపత్రికలు, కరపత్రాలను జిల్లా కలెక్టరు కె. వెట్రిసెల్వి సోమవారం కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కలెక్టరు మాట్లాడుతూ కొబ్బరి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. “కేర సురక్ష” ఇన్సూరెన్స్ పథకం ద్వారా అతి తక్కువ ప్రీమియంతో రూ.7 లక్షల వరకు ప్రమాద భీమా రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కార్మికుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించుకోవాలని సూచించారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో ఈ భీమా పథకం కార్మిక కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
గ్రామ స్థాయిలో ఈ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రతి అర్హులైన కార్మికునికి ఈ పథకం ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొబ్బరి చెట్లు ఎక్కే వారు, నీరా తీసే వారు, కొబ్బరికాయలు దింపే వారు, హైబ్రిడైజేషన్ పనులు చేసే వారు, కొబ్బరి పీచు తీసే మరియు వలిచే కార్మికులు ఈ పథకానికి అర్హులని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇంచార్జి ఆర్డీవో ఐ.కిషోర్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె. హమీబ్ భాషా, ఏపీ ఎంఐపీ పీడీ డా.యస్. రామ్మోహన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె. షాజానాయక్ తదితరులు పాల్గొన్నారు.



