తాజా వార్తలు

10/recent/ticker-posts

అమరావతి చట్టబద్ధతపై దెందులూరులో సంబరాలు – అరుణాచల యాత్రకు మహిళలు


దెందులూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 06: నియోజకవర్గంలో అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా గ్రామ గ్రామాన ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇళ్ల వద్ద దీపాలు వెలిగిస్తూ, రంగవల్లులు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో “అమరావతి చట్టబద్ధతపై అరుణాచల యాత్ర” కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.


పెడవేగి మండలం బాపిరాజు గూడెంకు చెందిన సుమారు 248 మంది మహిళలు జిల్లా టిడిపి ఉపాధ్యక్షురాలు బొప్పన సుధ ఆధ్వర్యంలో అరుణాచల యాత్రకు ఆరు బస్సుల్లో బయలుదేరారు. ఈ బస్సులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెండా ఊపి రామచంద్రపురం వద్ద యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అమరావతి రాజధానికి పార్లమెంటులో ఆమోదం లభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో మహిళలు అరుణాచలేశ్వరుడిని దర్శించేందుకు యాత్రకు బయలుదేరారని చెప్పారు. యాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు.

అమరావతి అంశంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు కూడా అభివృద్ధికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం విజన్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షురాలు బొప్పన సుధ, మండల పార్టీ అధ్యక్షుడు ఈడుపుగంటి అనిల్, జమలయ్యతో పాటు పలువురు కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.