తాజా వార్తలు

10/recent/ticker-posts

నడిరోడ్డుపై పోలీసు జీపులోనే భార్యను హత్య చేసిన భర్త


సంగారెడ్డి జిల్లా, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 06: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను భర్తే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జహీరాబాద్ ప్రాంతంలో కలకలం రేపుతోంది.


జహీరాబాద్‌కు చెందిన సిద్ధారెడ్డి, కవిత (29) దంపతులు. కవిత కొంతకాలంగా పవన్ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. మార్చి 27న ఆమె ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో, భర్త సిద్దరెడ్డి మార్చి 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల దర్యాప్తులో కవిత జడ్చర్లలో ఉన్నట్లు గుర్తించి, ఆమెను తిరిగి జహీరాబాద్‌కు తీసుకువస్తుండగా, సదాశివపేట మండలం నందికంది సమీపంలో ఘటన జరిగింది. కారులో తీసుకువస్తున్న సమయంలో సిద్ధారెడ్డి ఒక్కసారిగా ఆవేశానికి లోనై, తన వెంట తెచ్చుకున్న కత్తితో కవిత గొంతుపై దాడి చేశాడు.

తీవ్రంగా గాయపడిన కవితను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. పోలీసుల వాహనంలోనే ఈ హత్య జరగడం సంచలనం రేపింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.