ఏలూరు/ ఉంగుటూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 08: జిల్లాలో కాల్వలు, చెరువుల నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉంగుటూరు నియోజకవర్గంలోని నాచుగుంట గ్రామంలో పట్టెమ్మ చెరువును, పలు కాలువలు, చెరువులను స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఉంగుటూరు ఎంపిడిఓ కార్యాలయంలో 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం అమలుపై ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తో కలిసి అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామాలలో సాగు, త్రాగునీటికి ఎటువంటి ఎద్దడి లేకుండా గ్రామాలలోని నీటి వనరులను పూర్తిస్థాయిలో నింపడం, శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగు, త్రాగునీరు అందించడం 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. గ్రామంలోని నీటి వనరులు ఎన్ని ఉన్నాయి , వాటిని పూర్తి నీటి నిల్వ సామర్ధ్యంతో నీటిని నింపేందుకు తీసుకోవలసిన చర్యలపై గ్రామాల వారీగా నివేదిక అందించాలని, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపుడెక్క, తూడు తొలగింపు, పూడికతీత, ఆక్రమణల తొలగింపు, చెరువు, కాలవల గట్లు పటిష్టం, తదితర పనులకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం అమలుపై ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతిపాదనలు రూపొందించడం, పరిపాలన మంజూరు, పనులు పూర్తి, తదితర పనులు 100 రోజులలోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.
ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు ఉంగుటూరు నియోజకవర్గంలో నీటి సంరక్షణ పనులకు సంబంధించి 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించడం జరుగుతుందన్నారు. వాటికి పరిపాలనాపరమైన అనుమతులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇరిగేషన్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్ దేవప్రకాష్, తహసీల్దార్ పూర్ణ ప్రసాద్, ఎంపిడిఓ జి. మనోజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


