అమరావతి, పశ్చిమ వాహిని, ఏప్రిల్, 10: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాన్-లోకల్ హోంగార్డులను వారి స్వంత రాష్ట్రానికి బదిలీ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసి సమస్యపై వెంటనే చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో ఈ అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఏపీ హోంగార్డులు కుటుంబాలకు దూరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాధవ్ పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ హోంగార్డులను కూడా వారి స్వస్థలాలకు బదిలీ చేసే విధంగా పరస్పర మార్పిడి చేపట్టాలని సూచించారు. ఇరువైపులా సుమారు 200 మంది హోంగార్డులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
హోంగార్డుల తరపున నారాయణ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు పీవీఎన్ మాధవ్ ముఖ్యమంత్రిని కలసి సమస్యను వివరించారు. హోంగార్డుల కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హోంగార్డుల బదిలీ ద్వారా వారికి మానసికంగా, ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. తమ స్వస్థలాల్లోనే విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తే కుటుంబాలతో కలిసి జీవించగలరని తెలిపారు. ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.



